హైదరాబాద్ : శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. రేపటి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. సికింద్రాబాద్-తిరుపతి రైలుతోపాటు నాందేడ్-తిరుపతి రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. రెండేండ్ల అనంతరం భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించడంతో భక్తుల రద్దీ పెరుగనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా రైల్వేశాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లే నడిపేందుకు సిద్ధమని అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు (నంబర్ 07469/07470) ఈ నెల 22న సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.20 కి తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 23న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
కాగా, నాందేడ్-తిరుపతి మధ్య కూడా మరో ప్రత్యేక రైలు నడపనున్నారు. నంబర్ 07633 రైలును ఈ నెల 24న 12.00 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు 08.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-నాందేడ్ (నంబర్ 07634) ప్రత్యేక రైలు ఈ నెల 25న నడపనున్నారు. ఈ ట్రైయిన్ రాత్రి 21.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 17.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది.