Pulivendula Elections|జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఖండించారు. ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు లా అండ్ ఆర్డర్‌ను కాపాడుతూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు.
వైసీపీ నేతలు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారని మంత్రి డీబీవీ స్వామి విమర్శించారు. ఓట్ల కోసం ఇవాళ దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. 154 అసెంబ్లీ స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీకి బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. పులివెందులలో ఓటమిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే రిగ్గింగ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వాళ్ల ఎంపీ అవినాశ్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారని డీబీవీ స్వామి అన్నారు. మరి మా ఎమ్మెల్సీని కూడా అరెస్టు చేశారు కదా అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. వైసీపీ కార్యకర్తలలా తాము ధర్నాలు, గొడవలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని.. కూటమి ప్రభుత్వం కచ్చితంగా విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని.. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఏకపక్షంగా రాజకీయం చేయడం ఎవరూ ఉపేక్షించరని ఆయన స్పష్టం చేశారు.