Posani Krishnamurali | కొండపైకి వెళ్లడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు. ఓట్ల కోసం ఏ అఫిడవిట్ లేకుండా క్రిస్టియన్, ముస్లింల ఇంటికి వెళ్తారని.. అప్పుడు ఎవరికైనా అఫిడవిట్ ఇచ్చారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. తాను ఒక హిందువునని, తాను, తన భార్యతో కలిసి మసీదు, చర్చి అన్నింటికీ వెళ్తామని, మాకు ఎక్కడా అఫిడవిట్ అడగలేదని చెప్పారు.
చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకుంటున్నారని పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మందు అమ్మకాలు జరగడం లేదన్న వ్యక్తి.. ధర్మ పరిరక్షుడా అని విమర్శించారు. మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని గతంలో చంద్రబాబు ఓ మసీదులో చెప్పాడని గుర్తుచేశారు. మోదీ అంటే కేడీ, కేడీ అంటే మోదీ అని ఎంతో ఘోరంగా తిట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
చంద్రబాబు లాంటి వ్యక్తి వస్తాడనే అంబేడ్కర్ చాలా బలమైన రాజ్యాంగాన్ని రాశాడని పోసాని అన్నారు. అందుకే ఇలాంటి వాళ్ల నుంచి కాస్త స్వేచ్ఛగా బతుకుతున్నామని పేర్కొన్నారు. జగన్ ఏ పాపం చేశాడని.. ఆయన్ను ఎందుకింత హింసిస్తున్నారని ప్రశ్నించారు. నీ కొడుకు నారా లోకేశ్ భవిష్యత్తు కోసం జగన్‌ను నాశనం చేయాలని చూస్తున్నారా.. చంపాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు.
చంద్రబాబు తిరుమలను నాశనం చేయడానికి చూస్తున్నారని పోసాని కృష్ణమురళి విమర్శించారు. ఈ విషయాన్ని భక్తులు తెలుసుకోవాలని సూచించారు. దేవుడిని నమ్మండి.. మోసపూరిత కుట్రలను కాదని అన్నారు. చంద్రబాబు దేవుడి కంటే అతీతుడా అని ప్రశ్నించారు. తిరుమలకు రావద్దనడానికి చంద్రబాబు ఎవరని పోసాని నిలదీశారు. జగన్‌ది గ్రేట్ పాలిటిక్స్, చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్ అని విమర్శించారు.