AP News | అమరావతి : కుటుంబ వివాదాల కారణంగా ఓ సీఐ తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. తాడిపత్రి పోలీసు స్టేషన్లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఏ ఆనంద్ రావు.. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే గత కొంతకాలం నుంచి కుటుంబంలో వివాదాలు ఉన్నాయని, వాటి కారణంగానే సీఐ ఆనంద్ రావు ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందని అనంతపూర్ ఎస్పీ కంచి శ్రీనివాస్ రావు మీడియాకు తెలిపారు. ఆదివారం కూడా కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. సీఐ ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు. సీఐకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతూరు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి.