అమరావతి : కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరి షాప్లో భారీ చోరీని ఆదోని పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. శుక్రవారం రాత్రి అదోని పట్టణంలోని జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. షాపు తాళాలు పగులగొట్టి విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించారు. కోట్ల రూపాయల విలువైన 2.50 కిలోల బంగారం, 25 కిలోల వెండి చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
దుకాణంలోని సీసీ కెమెరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలో లభించిన నిందితుల ఆదారంగా విచారణ చేపట్టారు.గతంలో దుకాణంలో పనిచేసిన హఫీజ్ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని అంగీకరించాడు. తనతో పాటు మరో ఇద్దరు చోరీలో పాల్గొన్నట్లు వెల్లడించాడు.
దీంతో చోరీ చేసిన సొత్తు నుంచి పోలీసులు 1,250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. భారీ చోరీకి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.