Posani Krishna Murali | టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళీకి ఇబ్బందులు తప్పేలా లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల వరుసగా వైఎస్సార్సీపీకి చెందిన నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళీపై కేసులు నమోదైన విషయం విధితమే. తాజాగా కడప జిల్లా రిమ్స్ పోలీస్స్టేషన్లోనూ మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ ఫిర్యాదు చేయగా.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ రాజంపేట పోలీస్స్టేషన్లోనూ కేసు పెట్టడం గమనార్హం. ఇప్పటికే పోసాని కృష్ణ మురళీపై 50కిపైగా కేసులు నమోదయ్యయాయి.
మరో వైపు తెలుగు యువత, ఎస్సీ సెల్ నేతలు పోసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. త్వరలోనే నోటీసులు జారీ చేసి.. ఆయనను విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌తో పాటు పలువురిని లక్ష్యంగా చేసుకొని పోసాని కృష్ణమురళి విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేతలను లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదులు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తున్నారు.
అయితే, ఇటీవల ఓ టీవీ లైవ్ షోలో పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఈయనపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోనసీమ, తూర్పుగోదావరి అనపర్తి, కర్నూలు టౌన్-3, ప్రకాశం జిల్లా కనిగిరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు, కావలి, పల్నాడు జిల్లా క్రోసూరు మాచర్ల రూరల్, వినుకొండ పట్టణం, సత్తెనపల్లి, నరసరావుపేట టౌన్, అనకాపల్లి జిల్లా మునగపాక, నర్సీపట్నం, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పోలీసు స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నటి శ్రీరెడ్డిపై సైతం కేసులు నమోదైన విషయం విధితమే. ఆ తర్వాత ఆమె తనను క్షమించాలంటూ లోకేశ్‌కి లేఖ రాశారు.