కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ( Kurnool ) జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటనపై ( Bus Incident ) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawankalyan ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న 42 మందిలో 19 మంది సజీవదహనమయ్యారు.
మిగతా ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు. సమాచారం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరగడంతో జాతీయర రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.