అమరావతి : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరదలకు నష్టపోయిన గ్రామాలను జగన్ శుక్రవారం సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
బాధితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు (Chandra Babu) ప్రయత్నిస్తున్నారని విమర్శించారు . అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు గ్లోబల్‌కు తమ్ముడు అవుతారని విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పవన్‌కల్యాణ్(Pawab Kalyan) కు పాలన గురించి ఏమీ తెలియదని ఆయన సినిమా ఆర్టిస్ట్ (Cine Artist) అయితే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ (Drama Artist) అని ఎద్దేవా చేశారు.
ఏలేరు రిజర్వాయర్ కింద వరదలొస్తాయని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయలేదని పేర్కొన్నారు. రిజర్వాయర్ మేనేజ్మెంట్ను పట్టించుకోలేదని, ఇది ప్రకృతి సృష్టించిన విలయం కాదని , మ్యాన్‌మేడ్ ఫ్లడ్ అని అన్నారు. ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందని, ప్రజల పట్ల మానవత్వం చూపడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు రైతులకు రైతుబీమా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీలు అందించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏది జరిగినా జగన్ కారణమంటూ జగన్ నామాన్ని జపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం కేవలం ఫొటోలకే పరిమితమైందని ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.