ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సింగల్‌గానే వస్తామంటూ అధికార వైసీపీ చేసిన కామెంట్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో కేవలం వ్యూహాలు మాత్రమే వుంటాయని, సినిమా డైలాగులకు స్థానం లేదని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సింహం సింగిల్‌గా వస్తుంది అన్న డైలాగ్ సినిమాలకే బాగుంటుందని అన్నారు. సింహాలు గడ్డం తీసుకోవు.. నేను తీసుకుంటాను అన్నవి సినిమాలో మాత్రమే చెబుతానని, నిజ జీవితంలో చెప్పనని చురకలంటించారు.
అయితే వ్యూహం అనేది ప్రజల కోసమే వేస్తానని, తన కోసం ఎంత మాత్రమూ కాదని స్పష్టం చేశారు. తాను ప్రజల గుండెల్లో చిర స్థాయిగా ఉండాలని కోరుకుంటానని అన్నారు. మాట మాట్లాడితే.. సింగిల్‌గా రావాలని వైసీపీ నేతలు అంటున్నారని, అసలు అలా చెప్పడానికి వారెవరు? అని పవన్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ వారు ఎలా వుండాలో తాము చెబుతున్నామా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతల అతి ఎక్కువైందని, కాస్త తగ్గాలంటూ చురకలంటించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే : పవన్
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, తాము సిద్ధంగానే వుంటామని జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు. జగన్ గనక మళ్లీ అధికారంలోకి వస్తే.. భవిష్యత్ ఎలా వుంటుందో ఒక్కసారి ప్రజలు ఊహించుకోవాలన్నారు. తనకు అధికార కాంక్ష లేదని, అయితే ప్రజలు అధికారం ఇచ్చినా, బాధ్యతగానే స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.