అమరావతి : ఏపీలోని హోటళ్లు, రెస్టారెంట్లకు నగదు చెల్లింపులు (Cash payment) చేయకుండా ఇబ్బందులు పెడ్తున్న స్విగ్గీ ఆర్డర్ల నిలిపివేత హెచ్చరికతో స్విగ్గీ (Swiggy ) యాజమాన్యం దిగివచ్చింది. విజయవాడలో రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో అత్యవసర భేటీ నిర్వహించింది. స్విగ్గీ నిబంధనలు నష్టదాయకంగా ఉన్నాయని హోటల్ అసోసియేషన్ (Hotels Association) ప్రతినిధులు మరోసారి యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.
జీరో కమిషన్‌తో మొదలుపెట్టి 30 శాతానికి మించి వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండానే రాయితీలు, కాంబో ప్యాక్‌ల ప్రకటనపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినియోగదారులు చెల్లించే మొత్తాలను స్విగ్గీ వెంటనే జమ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈనెల 14 నుంచి స్విగ్గీ ఆర్డర్లు నిలిపివేయాలని ఇటీవల హోటల్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఈ తీర్మానంతో దేశవ్యాప్తంగా సంచలనం కలుగడంతో దిగివచ్చిన స్విగ్గీ చర్చలు జరిపింది. బకాయిల చెల్లింపులు, కమిషన్ల తగ్గింపునకు అంగీకరించింది.