Nellore Mayor | నెల్లూరు మేయర్ స్రవంతిపై ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు ఇచ్చారు.
నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 42 మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో వైసీపీ మేయర్ స్రవంతిపై ఇటీవల కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 91/ఏ ప్రకారం ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించి, అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతినిచ్చారు.
మేయర్ పొట్లూరి స్రవంతి దంపతులు నెల్లూరు నగర అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చిన సమయంలో ఆరోపించారు. మేయర్ దంపతుల అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, వారి జోక్యం, చేతివాటంకారణంగా కార్పొరేషన్లో ముఖ్యమైన దస్త్రాలు కదలడం లేదని వాపోయారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చామని వారు పేర్కొన్నారు.