Nara Lokesh | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్ల నుంచి వచ్చిన ఈ డిమాండ్ పాజిటివ్ కంటే నెగెటివ్‌గానే ఎక్కువగా వెళ్లింది. జనసేన నాయకులు కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలని టీడీపీ అధిష్ఠానం తెలుగు తమ్ముళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ టీడీపీ నాయకులు ఎవరూ తగ్గేదేలే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం కాదు.. నారా లోకేశ్ ఏపీకి కాబోయే సీఎం అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు ముందే టీజీ భరత్ భజన చేశారు. ఇప్పుడు నారా లోకేశ్ డిప్యూటీ సీఎం కాదు.. పీఎం అవ్వాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కోరికను బయటపెట్టారు. నారా లోకేశ్‌ను చూస్తుంటే వై నాట్ పీఎం ఆఫ్ ఇండియా ( Why Not PM of India ) అని అనిపిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
భీమిలిలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నారా లోకేశ్‌కు భజన చేశారు. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా అడుగుతుంటే.. రవితేజ మాత్రం మరో మెట్టు ఎక్కి ప్రధానిగా చూడాలని ఆశపడుతున్నానని చెప్పుకొచ్చారు. ‘ నందమూరి తారకరామారావు ముద్దుల మనమడు, మన గుండెచప్పుడు, మన ప్రియమైన నాయకుడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.’ అని రవితేజ తెలిపారు. లోకేశ్ అన్న పొలిటికల్ జర్నీ మాలాంటి యువతకు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు. అమెరికాలో చదువుకుని వచ్చిన ఆయన.. ఏపీ రాజకీయాల్లో ఒక గేమ్‌చేంజర్ అవుతారని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు.
లోకేశ్‌లాంటి చక్కటి రాజకీయ నాయకుడు మనకు చాలా ఇంపార్టెంట్ అని గంటా రవితేజ అన్నారు. లోకేశ్ తీసుకునే ప్రతి అడుగుకు హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్‌ను చూస్తుంటే వై నాట్ పీఎం ఆఫ్ ఇండియా ( Why Not PM of India ) అని అనిపిస్తుందని తెలిపారు. అందరూ డిప్యూటీ సీఎం అని అంటున్నారు.. కానీ ఆయన ప్రధాని ఎందుకు కాకూడదని ఉల్టా ప్రశ్నించారు. ఒకప్పుడు పీవీ నరసింహారావు ఒక్కరే తెలుగు వాళ్లలో పీఎం అయ్యారని గుర్తుచేశారు. ఎవరికి తెలుసు ఆ బాబా ఆశీస్సులు ఉంటే లోకేశ్ కూడా ప్రధాని అవుతారేమో అని అన్నారు. నారా లోకేశ్‌ను ఏదో ఒకరోజు పీఎంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.