Ambati Rambabu | రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనబెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని విమర్శించారు. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. లోకేశ్ చెప్పిన విధంగా పోలీసులు నడుస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి తమకు తిరుగులేదని.. పోలీసులు తాము ఏం చెబితే అది చేయాలన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అంబటి రాంబాబు తెలిపారు. ఎవర్ని పట్టుకురావాలంటే వారిని పోలీసులు పట్టుకురావాలి.. ఎవర్ని లోపల వేయమంటే వాళ్లను లోపల వేయాలన్నట్లుగా నడుస్తోందని విమర్శించారు. ఒక్కొక్క వ్యక్తి మీద ఒకటి రెండు కేసులు కాదు.. 15 కేసులు, 20 కేసులు, 30 కేసులు అని పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు తిప్పుతూ హింసిస్తున్నారని మండిపడ్డారు. బహూశా బ్రిటీష్ వారి పరిపాలన చేసే రోజుల్లో కూడా స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిపై ఇన్ని కేసులు పెట్టి ఉంటారని అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
మీడియా, సోషల్‌మీడియాపై అణిచివేత ధోరణిలో కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగానికి మరి మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. మన కంటే ముందుగా దాని రచయిత నారా లోకేశ్ ఈ సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో ఆయన దోషిగా నిలబడాల్సి వస్తుందని చెప్పారు.