అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. క్రాప్ హాలీడే నిర్ణయానికి సిద్ధపడుతున్న ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో సీఎంను కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు క్రాప్ హాలీడే పేరుతో ఆందోళన చేస్తున్నారని, ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. రైతులతోపాటు ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వా పరిశ్రమలో హాలీడే ప్రకటించకముందే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ధరల పెరుగుదలతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిపోయిందని, ఆక్వా రైతులు వ్యాపారం చేసేందుకు జంకుతున్నారని నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆక్వా రంగం సంక్షోభానికి గురికాకుండా చూడాలని లేఖలో కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమరు ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచి ఒక్కో రంగంల సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఇది యాధృచ్చికమో లేదా ప్రభుత్వ వైఫల్యమో తెలియదంటూ చురకలంటించారు.
ఇసుక పాలసీ మార్చడంతో భవన నిర్మాణ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని, ఫలితంగా దీనితో ముడిపడిఉన్న 130 కి పైగా వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని ఆరోపించారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారని, విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి రాష్ట్రంలో రైతులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. ఆక్వా రంగానికి మేలు చేస్తానని అధికారంలోకి రాక ముందు హామీ ఇచ్చిన తమరు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తమ ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలు అందించి ఆక్వా రంగాన్ని ఆదుకోగా.. వారికి సబ్సిడీలు ఎత్తివేసి సంక్షోభానికి ప్రత్యక్ష కారకులయ్యారని దుయ్యబట్టారు.