AP News | ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణకు సీఎంవో ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో అత్యాచార కేసులో విచారణకు హాజరయ్యేందుకు కాదంబరీ ముంబై నుంచి విజయవాడకు వచ్చారు.
ఈ అత్యాచారం కేసులో నిజానిజాలను తేల్చేందుకు ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాదంబరి నుంచి ఆమెనే వివరాలు తీసుకోనున్నారు. ఈ కేసులో భాగంగానే విజయవాడకు వచ్చిన కాదంబరీ జత్వానీ ముందుగా సీపీ రాజశేఖర్ బాబును కలిసి వివరాలను వెల్లడించనున్నారు. అనంతరం ఇన్వెస్టిగేషన్ అధికారి స్రవంతి రాయ్ ముందు విచారణకు హాజరుకానున్నారు. కాగా, జత్వానీపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలించనున్నారు.
కాగా, విచారణకు విజయవాడ వచ్చే ముందు జత్వానీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు వేధించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, కొంతమంది అధికారులు తనను ఆటబొమ్మల వాడుకున్నారని తెలిపారు. తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. వాటిని ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు. ఈ కేసులో నిందితులకు కచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నానని తెలిపారు.