అమరావతి : మాజీ ఎంపీ కేశినేని నాని రూ.120 కోట్ల బ్యాంకు కుంభకోణానకి పాల్పడ్డారని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర ఆరోపణలు చేశారు. సామాన్యులు ఒక్క వాయిదా చెల్లించకుంటే బ్యాంకులు ఇంటి మీదకు వచ్చి దాడి చేసి పరువు తీస్తాయి. ఆస్తులు లాక్కుంటారు. కానీ ప్రజాధనం దోచుకుంటున్న రాజకీయ నాయకులను పట్టించుకోరని విమర్శించారు. ప్రజాధనం లూటీ చేసిన మాజీ ఎంపీ నాని అప్పు గురించి పట్టించుకోని బ్యాంకు అధికారులు ఎవరితో లాలూచీ పడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నాని ఖాతాలో రూ. 7 కోట్లు ఉన్నా ఆటో డిబిట్ ఎందుకు చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టం తన పని తను చూసుకుంటుందన్నారు. పొద్దన లేస్తే రతన్ టాటా నాకు ఆదర్శం అని చెప్పే నాని ఆయన కంపెనీనే మోసం చేశాడని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థలో చిన్న లూప్పోల్ను అడ్డు పెట్టుకొని మోసం చేశాడని ఆరోపించారు.