అమరావతి: త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రి పదవులు కోల్పోయిన వారిని పార్టీ పదవుల్లో నియమిస్తానని రెండ్రోజుల క్రితం నాటి క్యాబినెట్ భేటీలో ఏపీ సీఎం జగన్ హింట్ ఇచ్చారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే తమకు మంత్రిపదవి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకుంటున్నారు. కొందరైతే జిల్లా కేంద్రాల్లో సన్మాన కార్యక్రమాలకు, ర్యాలీలకు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం తన కోరిక తీరనున్నదన్న సంతోషంలో గుళ్లు, గోపురాలకు వరసబెట్టి తిరుగుతున్నారు. ఆమెకు అధిష్ఠానం నుంచి క్లారిటీ వచ్చినందునే వివిధ దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారని వైసీపీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే రోజా.. రెట్టించిన ఉత్సాహంతో కనిపించారు. శుక్రవారం పూజలో పాల్గొన్న ఆమెకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వదించారు. రోజా వెంట పలువురు వైసీపీ నేతలు కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు.. మంత్రి కావాలనే కోరిక ఉన్నది. తాజాగా సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పడంతో తనకు ఈసారి ఖాయం అంటూ సంబరపడిపోతున్నారని రోజా అనుచరులు చెప్తున్నారు.
వైసీపీ అధికారంలోకి రాగానే ఎవరి సంగతేంటోగానీ రోజాకు మాత్రం మంత్రి పదవి ఖాయం అన్న టాక్ వినపడింది. అనూహ్యంగా వివిధ సమీకరణాల కారణంగా జగన్ ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే, మంత్రి పదవుల నుంచి తప్పించిన వారిని పార్టీ పదవులు ఇచ్చి వారి సేవలను వాడుకుంటామని జగన్ స్పష్టం చేయడంతో.. జిల్లా నుంచి తనకు మంత్రి పదవి గ్యారంటీ అని రోజా సంబరపడిపోతున్నారు. ఇదే క్రమంలో వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ తన మొర దేవుళ్లు ఆలకించారని తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నట్లుగా తెలిసింది. తనకు మంత్రియోగం పట్టనున్నదన్న గట్టి నమ్మకంతో రోజా ఉన్నట్లు కనిపిస్తున్నారు.