MLA Kamineni | మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పింది. కైకలూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం.. నీటిలో చిక్కుకొని ఒక పక్కకు ఒరిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కామినేనిని కిందకు దింపి సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని ఆలపాడు-కొల్లేటికోట రహదారి పూర్తిగా నీటమునిగింది. దీంతో అక్కడి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతమైన పందిరిపల్లిగూడెం గ్రామానికి బొలెరో వాహనంలో వెళ్లారు. ఆ గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో కామినేని వాహనం వరద నీటిలో మునిగి ఒక పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, కూటమి నాయకులు.. కామినేనిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.