విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్లోప్రభుత్వం-ఉద్యోగుల మధ్య పీఆర్సీపై ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఉద్యోగులు విజ్ఞప్తికి విరుద్ధంగా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులు నారాజ్‌గా ఉన్నారు. ఆందోళనలే శరణ్యమని భావించి సమ్మెకు సైతం పిలుపునిచ్చారు. అయితే, ఉద్యోగులను మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ త్వరలోనే పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను చెల్లిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్లుగానే విద్యుత్ ఉద్యోగులకు కూడా పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపుపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ మార్చి 31 తో ముగియనున్నది. కొత్త పీఆర్సీ కమిటీపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీపై ఉద్యోగులు గుర్రుగా ఉండి ఆందోళనలకు సైతం దిగుతున్న సమయంలో.. విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ ఎలా ఉంటుందో? విద్యుత్ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో? వేచి చూడాల్సిందే.