అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) గత ప్రభుత్వ వైసీపీ నాయకుల ఆగడాలపై ట్విటర్ వేదిక ద్వారా విరుచుకుపడుతూనే ఉన్నారు. పరోక్షంగా తన అన్న వైఎస్ జగన్పై మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం ట్విటర్ (Twitter) ద్వారా స్పందించిన ఆమె వైసీపీ (YCP) హయాంలో జరిగిన గనుల దోపిడీపై విమర్శల అస్త్రాలను గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల (Mining) దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు. పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా, విచారణ జరిపి పట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే, తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.
5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారని, అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలను బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్జీటీ నిబంధనలను తుంగలో తొక్కారని, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ (ACB) విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి సర్కార్ను డిమాండ్ చేశారు.