నెల్లూరు: సాధారణ టైలర్ షాపులో కూడా మహిళల దుస్తుల కొలతలు కూడా పురుషులు తీసుకోరు. అయితే, నెల్లూరు జిల్లాలో మాత్రం మరికొన్ని రోజుల్లో విధుల్లోకి రానున్న మహిళా పోలీసులకు పురుషులు కొలతలు తీసుకున్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో.. జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి వివాదం ముగిసేలా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లా పరిధిలోని ఆత్మకూరు, కావలి డివజన్లలో మహిళా పోలీసుల యూనిఫామ్ కుట్టించే ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో కొలతలు తీసుకున్నారు. కొత్తగా డిపార్ట్మెంట్లోకి వస్తున్న మహిళా పోలీసుల డ్రెస్ కొలతలు తీసుకునే పనులను మగ టైలర్లకు అప్పగించారు. మగవారు కొలతలు తీసుకోవడంపై మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కొలతలు పురుషులతో తీయడం ఏంటని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఔట్ సోర్సింగ్‌కు అప్పగించాం: ఎస్పీ విజయారావు
మహిళా పోలీసుల డ్రెస్ కొలతలు పురుషులు తీసుకున్న విషయం తమ దృష్టికి రాగానే ఉన్నతాధికారులు స్పందించారు. కొలతలు తీసుకునేందుకు వచ్చిన పురుష టైలర్‌ను విధుల నుంచి తప్పించి మహిళలకే అప్పగించారు. దీనిపై జిల్లా ఎస్పీ విజయారావు మీడియాతో మాట్లాడుతూ.. మహిళా టైలర్లు కూడా ఉన్నారని తెలిపారు. మహిళా పోలీసులకు యూనిఫాం కుట్టించే బాధ్యతలను ఔట్ సోర్సింగ్ అప్పగించినట్లు స్పష్టం చేశారు. ఇలాఉండగా, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఫొటోలు తీసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది. అనుమతి లేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫొటోలు తీసి మహిళల ప్రైవసీకి భంగం కలిగించిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించారని సమాచారం