AP News | ఏపీలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపైనే తెనాలి పోలీసులు చితకబాదిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలులో ఓ మహిళపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో పలు ఆలయాల్లో వరుసగా దొంగతనాలు జరిగాయి. దీంతో దొంగల కదలికలపై నిఘా పెట్టిన మర్రిపూడి ఎస్సై రమేశ్ బాబు.. కొండపి మండలం జూళ్లపాలెంలో కిరాణ షాపు నిర్వహిస్తున్న కొండలరావు ఇంటికి వచ్చాడు. పోలీసు బృందంతో వచ్చిన రమేశ్ బాబు.. సీసీ కెమెరాలు చెక్ చేయాని కొండలరావు చెల్లెలు, అతని పిల్లల్ని అడిగారు. దీనికి స్పందించిన మహిళ.. మా అన్నయ్య ఊళ్లో లేరు.. ఫోన్లో మాట్లాడండి అంటూ కాల్ కలిపి ఇచ్చింది. ఫోన్లో మాట్లాడిన కొండల్రావు తాను లేనప్పుడు పోలీసులను ఇంట్లోకి అనుమతించనని.. సాయంత్రం ఇంటికొచ్చాక సీసీటీవీ ఫుటేజీని పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి స్టేషన్‌కు వచ్చి ఇస్తానని చెప్పారు. లేదంటే తాను ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులే స్వయంగా వచ్చి సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోవచ్చని ఎస్సై రమేశ్‌బాబుకు వివరించారు.
On May 28, shocking @APPOLICE100 highhandedness came to light in Jallapalem, Kondapi mandal, Prakasam district. Sub-Inspector Ramesh Babu from Marripudi forcibly entered the house of Kondalrao, who runs a kirana shop, citing temple thefts in the neighboring mandal. Despite… pic.twitter.com/WZNul3BE0j
— YSR Congress Party (@YSRCParty) June 3, 2025
గతంలో ఓ ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఇదే ఎస్సై తనకు న్యాయం చేయకపోగా నిందితులపై నిలబడ్డారని కొండల్రావు గుర్తుచేశాడు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. తనను ఇరికించే ఉద్దేశంతో గంజాయి తన ఇంట్లో పెట్టి అక్రమ కేసులు బనాయించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశాడు. అందుకే తాను ఉన్నప్పుడే గ్రామస్తుల సమక్షంలో ఇంట్లోకి రావాలని ఎస్సైని కొండల్రావు కోరాడు. కొండల్రావు సమాధానంతో ఆగ్రహించిన ఎస్సై రమేశ్‌బాబు.. నువ్వు నాకు అనుమతి ఇచ్చేది ఏందంటూ బలవంతంగా ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. కొండల్రావు చెల్లెలు తలుపులు వేయబోగా.. ఆమెను బలంగా నెట్టుకుంటూ లోపలికి వెళ్లాడు. అడ్డుకునేందుకు యత్నించిన కొండల్రావు చెల్లెల్ని రెండు చేతులతో పట్టుకుని పక్కకు విసిరేశాడు. అక్కడే ఉన్న కొండల్రావు పిల్లల్ని వేలు చూపించి బెదిరిస్తూ.. తనకు ఎవరి అనుమతి అక్కర్లేదని.. మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి అంటూ ఎస్సై రమేశ్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఇంట్లోకి చొరబడి సీసీటీవీ డీవీఆర్‌ను తీసుకెళ్లిపోయాడు.
ఈ ఘటనపై కొండల్రావు సీఐకి ఫిర్యాదు చేశాడు. కానీ ఆయన పట్టించుకోలేదని కొండల్రావు వాపోయాడు. కాగా, మహిళపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ ఇంట్లోకి ఎస్సై చొరబడిన ఘటన అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డయ్యింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.