Maha Shivaratri Brahmotsavalu | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజైన గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు భృంగివాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆలయంలో ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం వేళలలో హోమాల అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన భృంగి వాహనంపై వేంచేపు చేసి షోడశోపచార పూజలు చేశారు. మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు.
గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. చెంచు కళాకారుల నృత్యాలు, కోలాటాలు, వేషధారణలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్ట బొమ్మలు, బీరప్ప డోలు ప్రదర్శనలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు, ముంబయ్ డోలు, విళక్కు స్వాగత సత్యం, నాదస్వరం, కేరళ చండీమేళం వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ జరిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి సాయంత్రం హంస వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం అధికారులు భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారలకు పట్టువస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఈవో కే సత్యనారాయణమూర్తి బృందం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగా.. మల్లికార్జున స్వామి ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున సంప్రదాయం మేరకు పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఈవో నటరాజరావు, అర్చకులు భాను, వేదంపడితులు సోమశేఖరశర్మ, వేంకటేశ్వర శర్మ పాల్గొన్నారు.
ఉత్సవాల సందర్భంగా ఈవో శ్రీనివాసరావు శివసేవకుల బృందాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వచ్ఛంద సేవలకు పలు సూచనలు చేశారు. అందరూ అంకితభావంతో సేవలు అందించాలని చెప్పారు. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయప్రాంగణం, అన్నప్రసాద వితరణ, హెల్ప్‌డెస్క్, కల్యాణకట్ట తదితర ప్రాంతాల్లో సేవలు అందించాలని కోరారు. సేవలు తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే సేవలు అందించాలని.. అందరూ తప్పనిసరిగా సమయ పాలన పాటించాలన్నారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని.. ప్రతి భక్తుడిని దేవస్థానం అతిథిగా భావించాలన్నారు. హెల్ప్‌డెస్క్‌లో శివసేవకులు ఓపికగా సమాచారం ఇవ్వాలన్నారు. దేవస్థానం సిబ్బంది శివసేవకులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారన్నారు.