అమరావతి : ఏపీలో వైసీపీ పనితీరుపై ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. నరసాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీని తాను చిన్నమాట కూడా అనలేదని పేర్కొన్నారు. తప్పు చేయకుండా పార్టీ వేటు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రతిరోజు వైసీపీ ఎంపీ రఘురామరాజు పార్టీని, సీఎంను దూషిస్తున్నా ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని నిలదీశారు. తనకుఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. సాయంత్రం లోపు సస్పెన్షన్ కారణాలు మీడియాకు విడుదల చేయాలని, సరైన కారణం లేకుండా సస్పెండ్ చేస్తే చట్టపరంగా పోరాటం చేస్తానని వెల్లడించారు.
సస్పెండ్‌కు గల కారణాలు ఏమిటంటే ?
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిన్న వైసీపీ ప్రకటించింది. సీఎం జగన్ ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన నరసాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో పాల్గొనడంతో పాటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్‌రాజుపై బహిరంగ విమర్శలు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించడాన్ని అధిష్ఠానం తప్పుబట్టింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించుకుని బుద్ది తక్కువ పనిచేశానని జిల్లా సాధనకోసం నిర్వహింఇచన ఉద్యమంలో తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.