అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం చరిత్రలో ఏనాడు లేని విధంగా అతి పెద్ద కుంభ కోణానికి ( Largest scam ) పాల్పడిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) ఆరోపించారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై థర్డ్ పార్టీ ( Third-party probe )తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం ఎక్స్‌లో ఆయన చంద్రబాబు, నారా లోకేష్ పై విమర్శలు చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించి అక్రమాలకు తెర తీశారని ఆరోపించారు. 16వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా ధ్వంసం చేశారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉండడం వల్ల నిజనిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు.