AP News | వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబంపై దొంగలనే ముద్ర వేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్‌పై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. తప్పుడు కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
2017 ఏప్రిల్ 1 తర్వాత బీఎస్ 4 వాహనాలు అమ్మకూడదని.. రిజిస్ట్రేషన్ చేయకూడదని అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు తీర్పులు ఇచ్చాయని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కానీ అమ్మిన వారు, రిజిస్ట్రేషన్ చేసినవాళ్లు ఇంటికి పోయారని అన్నారు. తప్పు చేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగల మాదిరిగా అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేశారని కన్నీళ్లు పెట్టారు.
జేసీ ట్రావెల్స్‌పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పది రోజుల్లో న్యాయం జరగాలని అన్నారు. లేదంటే తన కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తారని.. తాను, తన భార్య ట్రాన్స్‌పోర్టు ఆఫీసు ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించింది కాదని.. తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు.
ఏపీని చెడగొట్టింది ఐఏఎస్, ఐపీఎస్‌లే అని జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ అధికారులు అంత అవినీతిపరులే అని ఆరోపించారు. తన బస్సులు అన్నింటినీ ట్రాన్స్‌పోర్టు అధికారులు రిపేర్ చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పరువు తీసి బయట తిరగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.