జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధికార వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తనను సీబీఎన్ దత్తపుత్రుడంటూ వ్యాఖ్యలు చేస్తే మాత్రం బాగోదని హెచ్చరించారు. తనను వైసీపీ నేతలు, సీఎం జగన్ అలా అంటే మాత్రం తాను సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను కేవలం విధానాల పరంగా మాత్రమే ఎవ్వరినైనా విమర్శిస్తానని స్పష్టం చేశారు.
తాము టీడీపీకి బీ టీమ్ అని 2019 సార్వత్రిక ఎన్నికల ప్రారంభం నుంచి అంటున్నారని, ఇకపై ఇలాంటి విమర్శలు చేస్తే, చర్లపల్లి షటిల్ టీమ్ అనాల్సి వస్తుందని పవన్ విరుచుకుపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచీ తమను బీ టీమ్ అని విమర్శలు చేస్తున్నారని, అయినా ఊరుకుంటున్నామని, ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు దేశ సేవలు చేయలేదని, ఆర్థిక నేరాలు చేసి జైలు శిక్షలు అనుభవిస్తున్నారని పవన్ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్రను మంగళవారం ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ యాత్ర ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాయి కుటుంబాన్ని పవన్ పరామర్శించి, ఆయన భార్యకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. పార్టీ తరపున అండగా వుంటామని పవన్ హామీ ఇచ్చారు. ఇక.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ధర్మవరం మండలంలోని గొట్లూర్ గ్రామానికి వెళ్లారు. పూలకుంట, మన్నీ గ్రామాలకు కూడా వెళ్లి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించారు.