Janasena MLA Pantham Nanaji | వైద్యులపై దౌర్జన్యానికి దిగిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మెడికోల ఆందోళనల నేపథ్యంలో దిగొచ్చిన ఆయన.. వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదని తెలిపారు. అలా ఎవరితోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు. కోపంలోనే బూతులు వచ్చాయని వివరించారు. వైద్య వృత్తికి క్షమాపణలు తెలిపారు. తనపై కేసు నమోదు చేయవద్దని కూడా అడగడం లేదని అన్నారు.
అసలు ఏం జరిగిందంటే.. కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే నానాజీ అడగ్గా, ఉన్నతాధికారుల అనుమతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్ఎంసీ అధికారులు తెలిపారు. అయితే, వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న జనసేన కార్యకర్తలను ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే నానాజీకి ఆయన అనుచరులు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం రాత్రి ఆయన మైదానానికి వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్యపదజాలంతో దూషించారు నానాజీ. అనంతరం ఆయనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరోవైపు ఉమామహేశ్వరరావుకు మద్దతుగా మెడికోలు అందరూ ధర్నా చేపట్టారు. ఇక మెడికోల ఆందోళనల నేపథ్యంలో దిగొచ్చిన ఆయన ఉమామహేశ్వరరావుకు క్షమాపణలు చెప్పారు.
ఇదిలావుంటే తాను చెసిన తప్పుకు కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే నానాజీ డాక్టర్ను దూషించినందుకు సోమవారం ప్రాయశ్చిత దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఒక ప్రజా ప్రతినిధి ఎలా ఉండకూడదో అలా నేను ఉన్నా. నిన్న ఆవేశంతో తప్పుగా మాట్లాడాను. ఈ విషయంలో మిగిలిన వారు నన్ను ఆదర్శంగా తీసుకోకూడదని ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నా అంటూ నానాజీ చెప్పుకోచ్చారు.