Pawan Kalyan | తెలుగు దేశం పార్టీతో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేశ్‌తో కలిసి రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని, బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీ భవిష్యత్తు బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని పవన్ విమర్శించారు.
ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన – తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తాయి..#HelloAP_ByeByeYCP pic.twitter.com/bsbs46URBk
— JanaSena Party (@JanaSenaParty) September 14, 2023
అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. చంద్రబాబు భద్రత విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అధికారులు జగన్‌ను నమ్ముకుంటే.. కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్లేనని అన్నారు. డీజీపీ, సీఎస్ సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగదోడే అవకాశం ఉంటుందని చెప్పారు. చట్టాలను అధిగమించి చేసే అధికారులు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరని విచారం వ్యక్తం చేశారు.
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. టీడీపీ, జనసేన పార్టీల మధ్య ముసుగు తొలగిపోయి.. ప్యాకేజి బంధం బయటపడిందని వైఎస్సార్సీపీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా కౌంటర్ వేసింది. టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునేందుకే పవన్ కళ్యాణ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారని ప్రజలకు అర్థమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ తనపై నమ్మకం పెట్టుకున్న కాస్తో కూస్తో మంది ప్రజలకు ఉన్న భ్రమలను ఈరోజుతో తొలగించేశావని ఎద్దేవా చేసింది. ఇక ఇది పొత్తులకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని స్పష్టం చేసింది. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఏపీ నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధమయ్యారని విమర్శించారు.
“ప్యాకేజ్ బంధం బయటపడింది”
నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.… pic.twitter.com/MCjVLq26zb
— YSR Congress Party (@YSRCParty) September 14, 2023
కాగా, పొత్తుకోసమే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ వెళ్లాడని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. జనసేన, టీడీపీల మధ్య పొత్తు కొత్తేమికాదని, జైలు నుంచి వచ్చాక సెంటిమెంట్ కాదు సెటిల్మెంట్ అని అర్ధమైందని మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దొంగతనం చేసి దొరికిన దొంగ అని విమర్శించారు. ప్యాకేజీ బంధం బయటపడిందన్నారు. ఇప్పుడే పొత్తుపై నిర్ణయం తీసుకున్నామంటే నమ్మే పిచ్చొళ్లు ఎవరూ లేరని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జనసైనికులారా ఆలోచించండి.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా లేదూ? అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని రుజువు చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవన్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైందని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు.