చిత్తూరు: తిరుపతిలో దారుణం చోటు చేసుకున్నది. తిరుపతి నగరానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. తిరుపతి పట్టణానికి సమీపంలోని పేరూరు చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. తమ కార్యకర్త దారుణ హత్య విషయం తెలుసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను ఎదుర్కొనే ధైర్యం లేకనే హత్యారాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులు తెలిపన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తిరుపతి గాంధీపురానికి చెందిన సుహానా బాషా జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని కొందరు వ్యక్తులు బాషాపై దాడి చేసి కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హతమార్చారు. పేరూరు చెరువపై బాషా మృతదేహాన్ని కనుగొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పేరూరు చెరువు వద్దకు చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు.
సుహానా బాషా దారుణ హత్య విషయం దావానలంలా వ్యాపించడంతో స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బాషాను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. స్థానిక జనసేన నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుహాన్ బాషాను హత్య చేసి పారిపోయిన వారిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.