అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణ నవంబర్ 11కు వాయిదా (Adjourn) పడింది. జగన్ అక్రమాస్తుల ( Illegal assets ) కేసులపై గతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjeev Khanna ) నేతృత్వంలో విచారణ జరిగింది.
ఈ విచారణకు ఏఎస్జీ హాజరుకాకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వెంటనే విచారణకు హాజరుకు రప్పించాలని ఆదేశాలు జారీ చేయగా విచారణను మధ్యాహానానికి వాయిదా వేసింది. తిరిగి కోర్టు ప్రారంభం అయిన తరువాత విచారణ ప్రారంభం కాగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) అందుబాటులో లేరని జస్టిస్‌కు ప్రతివాదులు వివరించారు. దీంతో కేసును నవంబర్ 11కు వాయిదా వేశారు.
ఇలాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని అనుసరించాల్సిందేనని, అవే మార్గదర్శకాలు సీబీఐకి కూడా వర్తిస్తాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు.