అమరావతి : సెకీతో విద్యుత్ ఒప్పందాలలో అబద్ధాలను అందంగా అల్లటంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) ఆస్కార్ అవార్డు (Oscar Award) ఇవ్వాలని వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ట్విటర్లో (Twitter)లో డిమాండ్ చేశారు.
2021 మే నెలలో సెకీ (SECI) వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా ? అంటూ ఎద్దేవా చేశారు. అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా ? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా ? దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు.
రూ.1,750 కోట్లు ముడుపులు ఇవ్వడం చరిత్ర
అదానీతో ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్రనేని, రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్రేనని ఆరోపించారు. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం , గంటల్లోనే క్యాబినెట్ పెట్టి, ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్రేనని విమర్శించారు.
అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ లో నాపేరు ఎక్కడుందని బుకాయిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఏపీ సీఎంగా అంటే ఆనాడు మీరు కారా. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా? సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముడుములు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్(PPL) చేసుకుందని, రూ.35వేల కోట్ల భారం వేసిందని ఆరోపించిన జగన్ అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు.
టెండర్లను ఎందుకు రద్దు చేయాలేదని , ఎందుకు విచారణ జరిపించలేదని ట్విటర్లో నిలదీశారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని అనుకుంటే బైబిల్ మీద ప్రమాణం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.