అమరావతి : వైసీపీ ఐదేండ్ల పాలన విచ్చలవిడిగా భూ కబ్జాలు పెరిగిపోయాయని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Satyaprasad) ఆరోపించారు. బుధవారం ఏపీ కేబినెట్ (Cabinet) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల భూములను ఆక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. వారి భూ దాహానికి ఎంతో మంది ప్రజలు నష్టపోయారని పేర్కొన్నారు .
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (Land grabs ) యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలువబోతుందని వెల్లడించారు. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుందన్నారు. వైసీపీ (YCP) గూండాల వల్ల నష్టపోయామంటూ భూకబ్జాలపై ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతి రోజూ వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. ఇకపై ఈ పరిస్థితి మారబోతుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే చట్టం వర్తిస్తుందని, ఎవరైనా కబ్జాలకు పాల్పడితే వారికి 10 నుంచి 14 ఏళ్లపాటు జైలు శిక్షతోపాటు భారీ స్థాయిలో జరిమానా విధించేలా చట్టం రూపొందించామని పేర్కొన్నారు. కబ్జాదారునికి అక్రమాస్తులు ఉంటే వాటినీ కబ్జాలుగా పరిగణించి జప్తు చేస్తామని, ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు.