Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. 11 రోజులు అయినా సరే టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందే వాణి పడిగాపులు కాస్తోంది. దువ్వాడ శ్రీను కూడా రెండు వారాలుగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో వాణితో కలిసి ఉండే ప్రసక్తే లేదని దువ్వాడ స్పష్టం చేశారు. వాణికి కేటాయించిన ఇంటికి వెళ్లిపోయి.. అవసరమైతే లీగల్గా పోరాడాలని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.
వాణి రోజుకోరకంగా మాట్లాడుతున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మొదట తనపైకి పిల్లలను పంపించిన వాణి.. ఆ తర్వాత టెక్కలి వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేసిందని.. ఆస్తులపై మాట్లాడిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా కలిసి ఉందామని చెబుతుందని మండిపడ్డారు. తన న్యాయవాది చెప్పడంతోనే వాణి మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిలో నుంచి తరిమి వేసిన తర్వాత చచ్చినా.. బతికినా పట్టించుకోలేదని అన్నారు. రాజకీయంగా తనను పతనం చేయాలన్నదే వాణి ఉద్దేశమని తెలిపారు. వాణితో కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
తండ్రిగా తన బాధ్యత నిర్వహిస్తానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టంచేశారు. ఒకవైపు పెద్ద మనుషులను చర్చలకు పంపిస్తూనే, మరోవైపు కోర్టుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతుళ్ల పేరు మీద సుమారు 29 కోట్ల ఆస్తులు రాయడానికి సిద్ధంగా ఉన్నానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఓ బంగళా ఇచ్చాను కదా దాన్ని వాడుకోవాలని సూచించారు. అవసరమైతే ఆ ఇంటికి వెళ్లిపోయి లీగల్గా పోరాటం చేయాలని తెలిపారు. దయచేసి తనను డిస్టర్బ్ చేయొద్దని కోరారు. వాణి ఖర్చుల కోసం16 నెలల్లో రూ.40 లక్షలు ఇచ్చానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.