Srisailam | శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. సుంకేశుల, జూరాల నుంచి ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయానికి 3,80,415 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. అదే సమయంలో జలాశయం నుంచి తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తడంతో నీరు నాగార్జున సాగర్‌కు వెళ్తున్నది. జూరాల స్పిల్ వే నుంచి 2,67,527 క్యూసెక్కులు.. సుంకేశుల నుంచి 9,039 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం డ్యామ్ స్పిల్‌వే ద్వారా 2,39,868 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 62,162 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.90 అడుగుల మేర నీరుందని అధికారులు పేర్కొన్నారు. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 269.750 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.800 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. కుడి గట్టులో 26,847 క్యూసెక్కులు.. ఎడమ గట్టులో 35,315 క్యూసెక్కుల వరద సాగర్ వైపు వెళ్తోందని వివరించారు.