విజయవాడ: గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వల్లనే విపరీతంగా అప్పులు పెరిగిపోయాయని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ మాత్రమే అప్పులు చేసినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ కంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేశాయని ఆయన గుర్తుచేశారు. తామెంతో నిబద్ధతతో పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏ సంక్షోభం లేకున్నా 2014-19 మధ్య కాలంలో టీడీపీ విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించారు. టీడీపీ 8.08 శాతం వడ్డీకి అప్పులు తెస్తే.. తాము 7 శాతానికి తెచ్చినట్లు పేర్కొన్నారు. కరోనా తర్వాత ప్రతీ రాష్ట్రం అప్పులు చేసిందని ఆయన గుర్తుచేశారు.
ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనే దురుద్దేశంతోనే రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల అప్పులపై పార్లమెంటులో ప్రశ్నిస్తే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్నట్లుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేసిందని గుర్తు చేసిన మంత్రి.. ఆ కాలంలో అనవసరమైన దానికంటే ఎక్కువగా అప్పులు చేసిందని అభిప్రాయపడ్డారు. ‘మా ప్రభుత్వ అప్పులు చేసింది. టీడీపీ ప్రభుత్వ అప్పులతో పోలిస్తే ఇది చాలా తక్కువ’ అని చెప్పారు. కర్ణాటకలో సగటు వార్షిక రుణ భారం రూ. 60,000 కోట్లు, తమిళనాడు అప్పు రూ.లక్ష కోట్లు పెరిగిందన్నారు. జనాభా వారీగా లేదా మరేదైనా ఏపీ రుణ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, స్థూల ఉత్పత్తితో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు తక్కువగా ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 15 శాతం నుంచి 16 శాతం అప్పులు పెరిగితే, ఇతర రాష్ట్రాల్లో 20 శాతం పెరిగాయని మంత్రి బుగ్గన చెప్పారు. 2014లో ఆర్థిక లోటు 3.95 శాతంగా ఉండగా, 2021-22లో ప్రభుత్వం 3 శాతానికి తగ్గించిందని తెలిపారు. పొరుగు రాష్ట్రాలు 4 శాతం కంటే ఎక్కువ ఆర్థిక లోటుతో ఉన్నాయన్నారు. సాధారణ ప్రయోజన రుణాల శాతం పెరిగిందని, ఇది కొవిడ్-19 పరిస్థితి కారణంగా జరిగిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.