మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి హైకోర్టులో బెయిలు లభించింది. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన 3 రోజుల క్రితం అరెస్టయిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఆయనకు బెయిలు ఇస్తూ హైకోర్టు జస్టిస్ లలిత తీర్పునిచ్చారు. ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టాభి.. టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పోలీసుల తీరును తప్పుబట్టిన ఆయన సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై కొందరు దాడులు చేశారు. పట్టాభి ఇంటిపై కూడా దాడి జరిగింది.
ఆ తర్వాత పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేస్తూ శనివారం నాడు తీర్పునిచ్చింది. కాగా, టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
పదిమందిని అరెస్టు చేశామని, మిగతా వారిని పట్టుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. దర్యాప్తు కోసం టీడీపీ కార్యాలయం సీసీ ఫుటేజిని కోరామన్నారు. దాడిలో పాల్గొన్న అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి చేసిన 11 మందిని అరెస్టు చేశామని తెలిపారు. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించినట్లు వారు వెల్లడించారు.