Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో రేపు ఏం జరగబోతోంది? కేతిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం ఎక్కడికి దారితీస్తుంది? అనేది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని అనంతపురంలోకి అడుగుపెట్టకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతిసారి కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైకోర్టు ఆదేశాలతో పోలీసుల ప్రొటెక్షన్‌తో రేపు తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి రాబోతుండటంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్‌గా మారింది.
కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కొద్దిరోజులుగా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుండటంతో పోలీసులు కూడా కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లినప్పటికీ ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో కేతిరెడ్డి నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే ఆయన్ను తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించింది.
ఇక కోర్టు ఆదేశాల ప్రకారం.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఎవరు ఇబ్బందులు కలిగించకుండా పోలీసులే చూసుకోవాలి. అవసరమైతే ఫోర్స్‌ను కూడా ఉపయోగించాలని సూచించింది. ఇదిలా ఉంటే.. తాడిపత్రిలో రేపు శివుడి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించనున్నారు. దీనికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ వర్గీయులు, కేతిరెడ్డి అనుచరుల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందోనని అంతా భయపడిపోతున్నారు. పెద్దారెడ్డి రావడం, జేసీ ఈవెంట్ ఒకే రోజు ఉండటంతో విపత్కర పరిణామాలు ఎదురవ్వకుండా పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.