అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది . గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముప్పనేని రవికుమార్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ఇవాళ విచారించిన కోర్టు వల్లభనేని వంశీతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీబ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో గనుల అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో వ్యాపారులు మోహన రంగారావు, లక్ష్మణరావు, శేషుకుమార్ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని వారి నుంచి జరిమానా, సీనరేజి రుసుం వసూలు చేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు.
బ్రహ్మలింగయ్య చెరువు సమీపంలో సహజసిద్ధంగా పెరిగిన వేల చెట్లనుకూల్చి వేశారని ఆరోపించారు. వీరిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.