Rains in AP : ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుభవార్త వినిపించింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కర్ణాటకను ఆనుకొని తెలంగాణలో ఆవర్తనం విస్తరించి ఉందని, దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
సోమవారం అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఏలూరు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, కర్నూలు, నెల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది.
ఆదివారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రకాశం, నంద్యాల, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.