AP Elections | టీడీపీ – జనసేన సీట్ల పంపకం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందన్న అంశంపై ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలని సూచించారు. జనసేనకు కనీసం 40-50 సీట్లు ఇవ్వకపోతే ఓట్ల బదిలీ జరగదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిని కూడా టీడీపీ – జనసేన చెరో రెండున్నరేండ్లు పంచుకోవాలని అన్నారు. సీఎం పదవి షేరింగ్‌పై చంద్రబాబుతో ప్రకటన చేయించాలని సూచించారు. ఈ మేరకు హరిరామజోగయ్య ఓ బహిరంగ లేఖ రాశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దామోదరం సంజీవయ్య మినహా బడుగు బలహీన వర్గాల నాయకులు ఎవ్వరూ ముఖ్యమంత్రులు కాలేరని హరిరామజోగయ్య గుర్తు చేశారు. జనాభాలో 4 శాతం ఉన్న కమ్మ, 6 శాతం ఉన్న రెడ్లు మిగిలిన బలహీనవర్గాలను ఉపయోగించుకుని రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. 25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను బీసీగా గుర్తింపు పొందకుండా.. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు పొందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. వైసీపీని దింపాలంటే జనసేనకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా టీడీపీతో కలిసి వెళ్లక తప్పని పరిస్థితి అని చెప్పారు. అలా అని వైసీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని స్పష్టం చేశారు. జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టమైన పని అనేది 2019 ఎన్నికల్లోనే తేలిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందని కాదు.. టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు ఇస్తుందన్న చర్చనే జరగాలని అన్నారు. జనసేన కనీసం 50 సీట్లను అయినా దక్కించుకుంటేనే.. రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా, పాక్షికంగా దక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
తనకు పదవులు ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పవన్ కళ్యాణ్ తరచూ చెప్పే మాటలను హరిరామజోగయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలను ఎలా దక్కించుకుంటారని ప్రశ్నించారు. జనసైనికులు అడిగే ఈ ప్రశ్నకు ఎలా సమర్థించుకోగలరు చెప్పగలరు అని నిలదీశారు. జనసైనికులు సంతృప్తి పడాలంటే సీట్ల పంపకంలో కాకపోయినా.. సీఎం పదవిని అయినా చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని సూచించారు. ఇలా సీఎం పదవి షేరింగ్‌పై చంద్రబాబు నోటితో ప్రకటించగలుగుతారా? అని ప్రశ్నించారు.