Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ముగ్గురిపైనా 448, 427, 506 ఆర్అండ్డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమయ్యారని గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మీ పేరుతో తాము ఏపీ బేవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కొడాలి నాని, అప్పటి కృష్ణా జిల్లా జేసీ మాధవీలతా ప్రయత్నించారని చెప్పారు. ఇందుకోసం కొడాలి నాని తన అనుచరులతో కలిసి బెదిరింపులకు దిగారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గోడౌన్లో ఉన్న లిక్కర్ కేసులను పగులగొట్టి, తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయారు.
ఈ ఘటనపై వాసుదేవరెడ్డితో తన తల్లి సీతామహాలక్ష్మీ ఫోన్లో మాట్లాడగా.. ఆమెను అసభ్యకరంగా దూషించారని దుగ్గిరాల ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అప్పటి జేసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఆమె కూడా తమను దుర్భాషలాడిందని చెప్పారు. ఇది జరిగిన కొద్దిరోజులకే మనోవేదనతో తన తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపైనే ఫిర్యాదు చేస్తావా? అని అప్పట్లో కొడాలి నాని అనుచరులు కొందరు తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. ఆ ముగ్గురి నుంచి తనకు ప్రాణహాణి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాస్తానని తెలిపారు.