హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హెచ్ఐవీ ఉన్న విషయాన్ని దాచి ఓ యువకుడు పెండ్లికి సిద్ధమయ్యాడు.. తీరా తాళికట్టే సమయానికి హెచ్ఐవీ ప్రాజెక్ట్ అధికారి రావడంతో పెళ్లిని నిలిపివేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ యువకుడి (35)కి 2013లో హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
అప్పటి నుంచి మందులు వాడుతూ ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ క్రమంలో యువకుడు ఓ యువతితో పెండ్లికి సిద్ధమయ్యాడు. తాడేపల్లి క్రిస్టియన్ పేటలోని ఓ చర్చిలో రింగులు మార్చుకుని పెళ్లితంతు పూర్తవుతుందన్న సమయంలో అకడకు హెచ్ఐవీ ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ శాంసన్ సిబ్బందితో వచ్చాడు. వరుడికి హెచ్ఐవీ ఉన్న విషయాన్ని వధువు కుటుంబ సభ్యులకు చెప్పగా.. వాళ్లు పెళ్లిని నిలిపివేశారు. వివాహం ఆగిపోవడంతో పెండ్లి కొడుకు బంధువులు వధువు బంధువులతో గొడవకు దిగారు. దీంతో చర్చి ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించివేశారు.