తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా వెళ్లై సాత్తుపడి (ధవళ వస్త్రం) ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 26 న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమై విజయవంతంగా కొనసాగాయి. చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. చివరి రోజున జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ గా వ్యవహరిస్తారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 5న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా భగవద్ రామానుజాచార్యులవారిని తెల్లని వస్త్రాలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సాధారణంగా భాష్యకారుల సన్నిధిలో భగవద్ రామానుజాచార్యులకు కాషాయ వస్త్రం అలంకరిస్తారు. తెల్లని వస్త్రం అలంకరించడానికి ప్రత్యేక కారణం ఉంది. శ్రీవైష్ణవాచార్యులైన శ్రీరామానుజులవారు ఈ రోజున శ్రీరంగం నుంచి తెల్లని వస్త్రాలు ధరించి కర్ణాటకలోని మేల్కొటెకి వెళ్లారు. ఇందుకు శ్రీరామానుజులవారి అనుయాయులైన శ్రీ కూరత్తాళ్వార్ సహకారం అందించారు. ఆ తరువాత మేల్కొటెలో 14 సంవత్సరాల పాటు శ్రీ రామానుజులు ఆధ్యాత్మిక జీవనం గడిపారు. ఈ ఘట్టానికి గుర్తుగా భాష్యకార్ల ఉత్సవంలో చివరి రోజు తెల్లని వస్త్రాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. అన్ని వైష్ణవాలయాల్లో శ్రీరామానుజులవారికి ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.