అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతు ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గత ఏడాదితో పోల్చితే 14.5 శాతం రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో పెరిగిపోయాయని విమర్శిచారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ జరిగిన 8067 ఆత్మహత్యల్లో 5677 ఆత్మహత్యలు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వారివే అని పేర్కొన్నారు.
వీటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వైసీపీ నాయకులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మద్య నిషేదం అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం మద్యం దళారులతో మిలాఖతై వారితో విషపూరిత మద్యం తయారు చేయించి ప్రజలకు అందిస్తూ రూ. 5వేల కోట్ల ఆదాయం పెంచుకున్నారని మండిపడ్డారు.