(Amaravathi) అమరావతి: రైతుల ఆందోళనలతో కాస్తా మెత్తబడ్డ సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్త సంవత్సరంలో అమరావతి ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజధాని నగరం పేరుతో కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే ఈ కార్పొరేషన్లో 19 గ్రామాలను చేర్చారు. మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం కొంతకాలంగా సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మూడు రాజధానులు అంటూ చాలా రోజుల పాటు హంగామా చేసిన ప్రభుత్వం.. తాజాగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 19 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేయనున్న అమరావతి కార్పొరేషన్ పరిధిలో చేర్చుతున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు కానున్నది. ఈ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.