అమరావతి : ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినిమా ఫక్కీలో నగదు, బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనలలో 5గురు నిందితులను ప్రకాశం, నంద్యాల జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నరసారావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు శనివారం రాత్రి నంద్యాల నుంచి నరసారావుపేటకు కారులో బయలు దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారును దుండగులు మరో కారులో వెంబడించి గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్‌పోస్టుకు కొంతదూరంలో కారును ఆపి కారు అద్దాలను ధ్వంసం చేశారు. వ్యాపారులను బెదిరించి వారిపై దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ. 45 లక్షలు నగదుతో పాటు 950 గ్రాముల బంగారాన్ని దోచుకుని పారి పోయారు. వ్యాపారస్థుల ఫిర్యాదు మేరకు గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిం చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులు ఉపయోగించిన కారు కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.
దోపిడీకి పాల్పడ్డ దుండగులు మహానందిలో యాత్రికులుగా ప్రవర్తిస్తూ అక్కడే ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా దోపిడీ విషయాన్ని అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ దొంగలు వ్యాపారస్థులకు ఇన్ఫ్మార్మర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించి వ్యాపారస్థులను సైతం విచారిస్తున్నారు.