Garikapati Narasimha Rao | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పెళ్లి, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. గరికపాటిపై ఇటీవల కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువుతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రచారం వారి కుటుంబసభ్యులను, అభిమానులను చాలా కలతపెడుతుందని పేర్కొంది. వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, సత్య దూరమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు చేసింది.
కొన్ని వేర్వేరు సంఘటనల్లో గురువుగారు ఎవరెవరికో చెప్పని క్షమార్పణలను కూడా చెప్పారని, వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీమ్ ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా వారి పారితోషికం, ఆస్తుల విషయంలో కూడా నిరాధార, అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపింది. వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.
గరికపాటి నరసింహారావుపై ఇప్పటివరకు తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్, సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పరువు నష్టం దావాలు వేస్తామని ఆయన టీమ్ తెలిపింది. ఈ విషయంలో వ్యక్తులు గానీ, సామాజిక మాధ్యమాలు గానీ ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొంది.