Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామ దేవత అంకాలమ్మకు వార పూజల్లో భాగంగా అభిషేకాలు, విశేషార్చన జరిపించారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మ వారికి ప్రీతికరమైన గులాబీ గన్నేరు, దేవ గన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.
11న అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంలో ఏప్రియల్ 11వ తేదీన అమ్మవారికి నిర్వహించే సాత్వికబలి కుంభోత్సవానికి ఆనవాయితీ ప్రకారం ఆరంభ ప్రతీకగా ప్రతి శుక్రవారం కొబ్బరికాయలు సమర్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి ఎదుట కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద హారతులు సమర్పించడం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వహించే వారు స్త్రీ వేషంలో అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం ప్రత్యేకం.