చిత్తూరు: చిత్తూరు (Chittoor) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గంగాసాగరం వద్ద ఆగివున్న టిప్పర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న నలుగురు మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తమిళనాడులోని వేలూరు సీఎంసీ, నరివి దవాఖానలకు తరలించారు.
ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని ఢికొట్టిన అనంతరం 20 అడుగులు జారుకుంటూ వెళ్లిన బస్సు.. రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోవడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దవాఖానల్లో క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.